Sakshi News home page

ఎస్‌బీఐకి కొత్త చైర్మన్‌ వచ్చేశారు... 

Published Wed, Oct 4 2017 12:41 PM

 Rajnish Kumar frontrunner to be the next SBI chairman  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు కొత్త చైర్మన్ వచ్చేశారు. ఎస్‌బీఐ చైర్మన్‌గా రజ్‌నీష్‌ కుమార్‌ను నియమిస్తూ బ్యాంకుల బోర్డు బ్యూరో నిర్ణయం తీసుకుంది. కాగ, ఎస్‌బీఐ చైర్మన్‌గా అరుంధతి భట్టాచార్య పదవీ కాలంలో ఈ వారంలో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఈయన నియామకం జరిగింది. మూడేళ్ల కాలానికి గాను ఆయన ఎస్‌బీఐ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం కుమార్‌ బ్యాంకుకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 1980లో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరిన కుమార్‌, అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. పలు డిపార్ట్‌మెంట్లలో పనిచేసే అనుభవం ఆయనకు ఉంది. 

కుమార్‌ 2015లో ఎండీ కాకముందు, బ్యాంకు మెర్చంట్‌ బ్యాంకింగ్‌ ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా ఉన్నారు. ఎస్‌బీఐ చైర్మన్‌గా చేరకముందు భట్టాచార్య కూడా ఎస్‌బీఐ క్యాప్స్‌కు చైర్మనే. టాప్‌ స్థాయిలో ఉన్న నలుగురు ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్లను బ్యాంకుల బోర్డు బ్యూరో(బీబీబీ) ఇంటర్వ్యూ చేసిన అనంతరం రజ్‌నీష్‌ కుమార్‌ను ఎంపిచేసింది. కుమార్‌తో పాటు గుప్తా, బి.శ్రీరామ్‌, దినేష్‌ కుమార్‌లను బీబీబీ ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం బ్యాంకుకు చైర్మన్‌గా రాబోతున్న రజ్‌నీష్‌ కుమార్‌ మొండిబకాయిల సమస్యను పరిష్కరిస్తూ బ్యాంకును విజయబాటలో నడిపించాల్సి ఉంటుంది. కాగ, 2013లో ఎస్‌బీఐ తొలి మహిళ చైర్మన్‌గా ఎంపికైన భట్టాచార్య పదవీ కాలం ఈ వారంలో ముగియబోతుంది. గతేడాదే ఆమె పదవి కాలం ముగిసినప్పటికీ, ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళ బ్యాంకు విలీన నేపథ్యంలో ఆమె పదవిని ఏడాది పాటు పొడిగించిన సంగతి తెలిసిందే.  

Advertisement
Advertisement